స్విమ్స్ నెఫ్రాలజీలో టెలీ మెడిసిన్ వ్యవస్థ..
కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి తగిన సలహాలు, సూచనలు, వైద్య సహాయం అందించడానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(స్విమ్స్)లో నెఫ్రాలజీ విభాగం టెలీ...
కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి తగిన సలహాలు, సూచనలు, వైద్య సహాయం అందించడానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(స్విమ్స్)లో నెఫ్రాలజీ విభాగం టెలీ మెడిసిన్ వ్యవస్థను ప్రారంభించాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ జేఈవో సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తో కలసి శుక్రవారం ఆయన నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను పరిశీలించారు.
ఇన్ పేషంట్ వార్డులు, డయాలసిస్ వార్డులు, ఐసీయూ విభాగాలను ఆయన పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. ఇంటి వద్దే డయాలసిస్ చేసుకునే అవకాశం ఉండి ఆసుపత్రికి వస్తున్న రోగుల గురించి ఈవో వివరాలు తెలుసుకున్నారు. డయాలసిస్ కోసం ఉపయోగించే బ్యాగులకు డిమాండ్ ఉందని డాక్టర్లు వివరించగా ఏపీఎంఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తో ఈవో ఫోన్లో మాట్లాడి స్విమ్స్ కు డయాలసిస్ బ్యాగులను పంపాలని కోరారు.
డయాలసిస్ చేయించుకుంటున్న పిల్లలకు పెన్షన్ రావడం లేదని బాధితుల కుటుంబీకులు ఈవో దృష్టికి తీసుకువచ్చారు. స్విమ్స్ హాస్టల్ లో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యత గురించి ఆరా తీశారు. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఐటీ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి సంబంధించిన ఇంజినీరింగ్ నిర్వహణ పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు చేయించుకోవాలని సూచించారు. నెఫ్రాలాజీ, యూరాలజీ విభాగాల పనితీరును అభినందించారు.