ఎవరి ఆసరా కోసం దశాబ్ది ఉత్సవాలు..?
ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూపులే.. కన్నీరు ఇంకిన కళ్ళల్లో ఇంకా చావని ఆశలు.. రోజొక్క తీరుగా ఉత్సవాలు.. మారని వయోవృద్ధుల జీవన తీరు.. ఈనెల కేవలం 17 జిల్లాల్లోనే పెన్షన్..
- ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూపులే..
- కన్నీరు ఇంకిన కళ్ళల్లో ఇంకా చావని ఆశలు..
- రోజొక్క తీరుగా ఉత్సవాలు.. మారని వయోవృద్ధుల జీవన తీరు..
- ఈనెల కేవలం 17 జిల్లాల్లోనే పెన్షన్ క్రెడిట్..
- నిధుల లేమి.. ప్రధాన కారణం..
- సంబురాల ఖర్చులో 10 శాతం చాలు ఆసరా పంచడానికి..
- పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు పరిస్థితులు..
జీవితపు చివరి మజిలీలో ఆసరా కల్పించాలని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారికోసం సదుద్దేశ్యంతో ప్రారంభించిన ఆసరా పెన్షన్ల ప్రసహనం ఎండమావిలో నీటికోసం వెతుకున్నట్టుగానే మిగిలిపోయింది.. చివరి అంకంలో చిగురుటాకులా వణకి పోతున్న ముదుసలి జీవితాలకు ఆసరా కరువైపోయింది.. కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయినా ఇంకా చావని ఆశతో కొట్టుమిట్టాడుతున్న సంఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయి.. ఆసరా పెన్షన్లు అందాకా దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అర్ధాకలితో గడుపుతున్న వారు కోకొల్లలుగా కనిపిస్తున్నారు.. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక.. మృత్యువు జాడ తెలియక.. చస్తూ బ్రతుకుతూ.. జీవచ్ఛవాల్లా బ్రతుకునీడుస్తున్న అవ్వా, తాతలకు దిక్కెవ్వరు..? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జరుపుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు వారికి కనీసం అర్ధాకలి కూడా తీర్చలేకపోవడం ఎన్నుకున్న ప్రభుత్వాలు కల్పించిన దౌర్భాగ్యపు పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.. ఆసరా అందని ద్రాక్షపండులా మారిన వైనం ప్రతి హృదయాన్ని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి..
హైదరాబాద్ : ఓ వైపు అంబరాన్నంటుతోన్న తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలు.. మరోవైపు పెన్షన్ల కోసం ‘ఆసరా’ లబ్ధిదారుల దీనంగా చూస్తున్న ఎదురుచూపులు.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితి. దశాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర సర్కార్ రోజోక్క తీరుగా వేడుకల నిర్వహణపై దృష్టిసారించింది. అందుకోసం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఎవడబ్బ సొమ్మని ఇదంతా చేస్తోంది..? కట్టిన పన్నుల్లోంచి కేటాయించే ‘ఆసరా’.. లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ తన దమన నీతిని ప్రదర్శిస్తోంది ప్రభుత్వం.. కాగా ఈ నెల ( జూన్ ) ఇప్పటి వరకు కేవలం 17 జిల్లాలకు మాత్రమే పెన్షన్లు క్రెడిట్ కాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని ఐదు, ఉమ్మడి వరంగల్ లోని ఆరు, ఉమ్మడి నల్లగొండలోని మూడు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు చొప్పున మొత్తం 16 జిల్లాలకు పెన్షన్లు ఇంకా విడుదల కాలేదు. దీంతో అర్హులైన లబ్ధిదారులు ఆసరా పెన్షన్ డబ్బులకోసం కన్నులు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. అయితే పెన్షన్లు ఇచ్చేం దుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడమే ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో ప్రతి నెల వారం రోజుల లోపు పెన్షన్ డబ్బులు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈసారి అంతులేని జాప్యం చేస్తోంది. దీంతో లబ్దిదారులు పెన్షన్ డబ్బుల కోసం వేచి చూస్తున్నారు.. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ప్రచారానికి రూ. కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం పండుటాకులకు అందించాల్సిన ‘ఆసరా’ విషయాన్ని మాత్రం విస్మ రించిందని పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారికోసం సాయంగా నిలించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది
చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవీ బాధితులూ ఈ పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులకు పోస్టాఫీసు, బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. గ్రామాల్లో ఉంటోన్న వారి వార్షికాదాయం రూ.1.50ల క్షలు, నగరాల్లో రూ.2 లక్షలు మించని వారిని అర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం వికలాగులకు రూ.3వేలు, మిగతా అన్ని కేటగిరీల వారికిరూ. 2,016 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 46.42లక్షలకు మందికి ‘ఆసరా’ అందిస్తోంది. వృధాప్య పెన్ష న్లకు వయస్సును ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించింది. దీంతో ఆ కేటగిరీలో 12,27,824 ఉన్న పెన్షన్ల సంఖ్య అదనంగా ఏకంగా 8లక్షలకు పెరిగి 20.27లక్షలకు చేరింది. ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో వారికీ పెన్షన్లు అందుతున్నాయి..
కాగా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిన వేళ తెలంగాణ ఏర్పడిన రోజు నుండి ఇప్పటివరకు 9 సంవత్సరాల 6 నెలలు గడుస్తున్న వేళ.. దశాబ్ది ఉత్సవాలు దశాబ్దం కాకముందుకే ఉత్సవాలు జరపడం విడ్డూరంగా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విమర్శించడం జరుగుతోంది.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అధికారుల జీతాలు అగమ్యగోచరంగా మారిన వేళ దశాబ్ది ఉత్సవాలు జరపడం తగునా.. దశాబ్ది ఉత్సవాలు జరిపే సమయానికి తెలంగాణ అభివృద్ధి ముందు పదంలో నడుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలను.. పక్క రాష్ట్ర ప్రజలను నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఇదొక బూటకపు దశాబ్ది ఉత్సవాలు అని నేటి మేధావులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ధరణి పేరుతో రైతులను దగా చేసిన కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసమే ధరణి తెచ్చినానని గొప్పలు చెప్పడం ఎంతవరకు సబబు అని.. చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా విమర్శించిన తరుణంలో ధరణి తెచ్చిన అనంతరం.. ధరణిలో పేదోడి భూమి ఎక్కాలంటే నానా అవస్థలు పడాల్సిందే.. బలిసినోడి భూమి ఎక్కాలంటే తక్షణమే కలెక్టర్ నుండి సిసి దాకా డబ్బులు గుప్పిస్తే చాలు తక్షణమే వారు పనులు ఇంట్లో కూర్చుని కానిచ్చేస్తున్నారని ప్రతి పేద రైతుకు తెలిసిన విషయమే.. ఇలాంటి తరుణంలో మిషన్ కాకతీయ పేరుతో చెరువులను చరబట్టి, భూములను, మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్న ప్రజా ప్రతినిధులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని.. వారికి అడ్డు వచ్చిన అధికారిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేయించడమే వారి పనిగా పెట్టుకున్నారని.. ఇలాంటి తరుణంలో నియోజకవర్గాల వారీగా ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్న ప్రజా ప్రతినిధులకు చీమకుట్టినట్టు కూడా లేకుండా.. తమ సంపాదన పెంచుకునే పనిలో ఉన్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటాను అన్న దొరే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని.. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మన దొర అందినకాడికి పైకం వెనకేసుకున్నందుకు.. ఈ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారా..? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియమాకాలు అనే మూడు నినాదాలపై అభివృద్ధి చెందుతుందని యావత్తు తెలంగాణ రాష్ట్రం ఎదురుచూస్తున్న వేళ.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో గడిచిన తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలలో ఇప్పుడే పుట్టిన పాపకు కూడా లక్ష రూపాయగా అప్పువేసిన ఘనుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కెసిఆర్ అనే చెప్పాలి. కట్టిన ప్రాజెక్టులు ప్రజలకు, రైతులకు అవసరానికి ఉపయోగపడకుండా.. తమ కమిషన్లకు మాత్రమే ఉపయోగపడే విధంగా నిర్మించిన ఘనత అది కేసీఆర్ కే దక్కుతుందని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసని అందరూ దుమ్మెత్తి పోస్తున్న వేళ ఈ దశాబ్ద ఉత్సవాలు జరపడం భావ్యమేనా..?
ధరణిపై తీవ్రంగా మండిపడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు :
ధరణి పోర్టల్ ఏర్పాటు వెనుక కేసీఆర్ కు రహస్య ఎజెండా ఉందని వారు ఆరోపించారు. ధరణిపై ప్రజా దర్బార్ నిర్వహించి అడగండి.. ప్రజలు సరైన సమాధానం చెబుతారు అని వెల్లడించారు. కేసీఆర్ పాలమూరు ఎంపీగా పోరాడితే తెలంగాణ రాలేదు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిందని టీపీసీసీ అధికార ప్రతినిధి సంకేపల్లి సుధీర్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ సీఎంగా పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కేవలం కాళేశ్వరం పేరుతో డబ్బులు వృధా చేశారని విమర్శించారు. ఒక్క ఎకరా కూడా అదనంగా సాగులోకి రాలేదని పేర్కొన్నారు. ఎక్కడ నీళ్ళు కనబడినా.. ఇవి కాళేశ్వరం నీళ్ళు అని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్ 60 శాతం బాగాలేదన్నారు. ధనికులకు, పెత్తందారుకు మాత్రమే ధరణి బాగుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి రద్దు చేస్తామని పేర్కొన్నారు. ధరణి లేకుంటే.. రైతుబంధు రాదు, రైతు బీమా రాదు.. అంటూ కేసీఆర్ రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాలు అన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి తరుణంలో దశాబ్ది ఉత్సవాలు జరపడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.. తమ రాబోయే ఎన్నికలలో.. గెలుపు కోసం ఈ ఉత్సవాలు జరిపితే.. అది కాస్త తీవ్ర విమర్శలకు దారి తీస్తుందనే విషయం మరిచిపోయిన కేసీఆర్ ప్రభుత్వానికి చావుదెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..